ఎథిరిక్ శరీరం కోసం సంపూర్ణ విశ్లేషణ. (etheric body)

ఎథిరిక్ శరీరం
#సాధన - #దివ్యానుభూతులు

            
మానవుని మెదడులో రసాయనిక చర్య ద్వారా విద్యుత్తు తయారవుతుందని మనం గమనించాం కదూ? విద్యుత్తు మెదడులోనే కాదు. దేహమంతటా పుడుతూనే ఉంటుంది. రక్తంలో వుండేది ఎక్కువ భాగం నీళ్ళే. దేహంలోని నీళ్ళూ, లోహపు అణువులూ, ఉప్పు ద్రావణాలూ ఒక దానితో మరొకటి కలగలిసి రసాయనిక చర్యల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంటాయి. కాబట్టి మన శరీరం మొత్తం విద్యుత్తుతో నింపబడి ఉంటుంది. కానీ, దీని తీవ్రత ఎక్కువగా ఉండదు. ఇంట్లో మనం ఓ బల్బుని వెలిగించుకోవటానికి కావల్సినంత కరెంటు గానీ, వంటకి వాడే స్టవ్ కి సరిపోయేంత కరెంట్ కానీ మన దేహంలో ఉండదు. అలాంటి విద్యుత్తుతో మన శరీరంలోని విద్యుత్తుని పోల్చకుండా అయస్కాంతత్వం నుంచి పుట్టిన విద్యుత్తులాగా దీన్ని భావించండి.

                            మనం నిటారుగా ఉండే అయస్కాంతాన్ని తీసుకుని ఓ టేబుల్ మీద ఉంచి దాని మీద ఓ తెల్ల కాగితాన్ని ముడతలు లేకుండా అమర్చి దాని మీద ఓ గుప్పెడు ఇనుపరజనును చల్లితే ఆ ఇనుపరజను ఆ పేపరు మీద ఓ విచిత్ర రూపాన్ని చిత్రిస్తూ పేపరుకు అంటుకుంటుంది. ఈ ప్రయోగాన్ని మీరు ఓసారి చేసి చూస్తే మీకు ఈ విషయాలు బాగా అర్థంచేసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. ఇనుప సామాన్ల దుకాణం నుంచి కానీ, సైన్సు పరికరాలు అమ్మే దుకాణం నుంచి కానీ ఓ బార్ మ్యాగ్నెట్ ని కొనుక్కుని తీసుకురండి. దీని ధర ఎక్కువేమీ ఉండదు. అలాగే ఇనుపరజను కొని తెచ్చుకోండి. దీని ధర కూడా సరసంగానే ఉంటుంది. ఈ బార్ మ్యాగ్నెట్ మీద ఓ తెల్ల కాగితాన్ని ఉంచి దాని మీద ఇనుప రజనును చిలకరించండి. ఆ ఇనుప రజను ఆ పేపరు క్రింద ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని పేపరు మీద ప్రతిబింబిస్తూ చిత్రంగా అమరుతుంది. ఇనుప రజను మధ్యలో అయస్కాంత క్షేత్రం అంచులను చూపుతూ నిలుస్తుంది. అయస్కాంతం అంచుల నుంచి అయస్కాంత క్షేత్రం బయటకు వస్తున్నట్టు కనబడుతుంది. అదీ గాక, ఓ ధ్రువం నుంచి మరో ధ్రువానికి వంపు తిరుగుతూ ఈ క్షేత్రం వ్యాపించి ఉండటాన్ని కూడామీరు స్పష్టంగా గమనించవచ్చు. ఈ ప్రయోగాన్ని చేసి చూస్తే, మీకు కనిపించే అయస్కాంత క్షేత్రం క్రింద ఉన్న అయస్కాంతానికి ఎలా సంబంధించినదో మీకు అర్ధమైనట్లే మన శరీరానికి చుట్టూ అలాంటి అయస్కాంత శక్తి క్షేత్ర రేఖలూ ఉండి వ్యాపించి ఉండడం ఎలాగో మీకు అర్థమౌతుంది. మానవశరీరం చుట్టూ వ్యాపించే అలాంటి అయస్కాంత శక్తిని ’ఎథిరిక్’ అనీ, లేకపొతే ’ఆరా’ అనీ అంటారు. యోగి చక్షువులకు ఈ ’ఆరా’ స్పష్టంగా కాంతులీనుతూ వివిధ రంగులతొ నిండి కనిపిస్తూ ఉంటుంది. మన దేవుళ్ళ చిత్రాల్లో తలల వెనుక సూర్యబింబంలాగా చిత్రకారులు చిత్రించే కాంతి వలయానికి ఈ ’ఆరా’ యే ప్రేరణ అని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు.

                           ఓ అయస్కాంతం చుట్టూ ఓ అయస్కాంత క్షేత్రం ఉన్నట్టే విద్యుత్త్ ప్రవహిస్తూన్న ప్రతి లోహపు తీగ చుట్టూ కూడా అలాంటి అయస్కాంత క్షేత్రం ఎర్పడుతుందని మీరు మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ పాఠాల్లో చదువుకునె ఉంటారు. విద్యుత్తు ఒక వైపు ప్రవహిస్తూ వుంటే "డైరెక్టు కరెంట్" అని, చక చకా దిశలు మారిపోతూ అటూ ఇటూ ప్రవహిస్తూ ఉంటే "ఆల్టర్నేటింగ్ కరెంట్" అని, అంటాం. ఓ తీగలో డైరెక్ట్ కరెంట్ ప్రవహిస్తే దాని చుట్తూ ఉన్న అయస్కాంత క్షేత్రం స్థిరంగా నిలబడి ఉంటుంది. అదే త్ తీగలో ఆల్టర్నేటింగ్ కరెంట్ ప్రసరణ జరిగితే తత్ సంబందిత అయస్కాంతం కూడా స్థిరంగా కనిపించకుండా దిశలు మారుతూ ఉంటుంది. అలాంటి అయస్కాంత క్షేత్రం విపరీతంగా కంపిస్తూ ఉంటుంది.

                            మన శరీరంలో విద్యుత్తు ప్రవాహం జరుగుతూ ఉండటం వల్ల మన శరీరం చుట్టూ ఓ ’ఆరా’ ఏర్పడుతుంది. ఈ ’ఆరా’ ను గుర్తించడం కష్ట సాధ్యం. ఓ విద్యుద్దీపం ఓ సెకండ్ కు సుమారు అరవై సార్లు వెలుగుతూ ఆరి పోతూ ఉంటుంది. కానీ మన కన్ను దాన్ని గుర్తించడంలేదు. కానీ విద్యుత్ ప్రవాహంలో ఉత్పత్తి లోపంవల్ల దీపాలు నిర్జీవంగా కొట్టుకోవడం గమనించవచ్చు. ఒక్కోసారి ఓడల్లో దీపాలు కూడా గ్రుడ్డిగా మిణుకు మిణుకు మంటూ వెలుగుతూండటం గమనించవచ్చు.

                            ఓ మనిషికి మరో మనిషి మరీ దగ్గరగా వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒళ్ళు జలతరిస్తూంటుంది. చాలా ఎక్కువ మంది ఈ విషయం స్పష్టంగా గమనించి ఉంటారు. వెనక నుంచి వచ్చిన ఎవరో దగ్గరగా వచ్చి నిలబడి ఉన్నట్టు చాలామంది స్పష్టంగా గుర్తించగలరు. కావాలంటే మీరూ ఓ చిన్ని పరీక్ష చేసి చూసుకోండి. ఓ స్నేహితుడి మీద ఈ ప్రయోగం చేయండి. మీ స్నేహితుని వెనకాల నుంచుని మీ వ్రేలిని అతని మెడ వెనక భాగం తాకండి. వ్రేలితో ముట్టుకోకపోయినా, ముట్టుకున్నా చాలామందికి ఒకేలాగా ఉంటుంది - ముట్టుకున్నట్టుగానే, ఎంచేతనంటే శరీరం చుట్టూ ఉండే ’ఎథిరిక్’ కి కూడా స్పర్శజ్నానం ఉంటుంది.

                           శరీరం చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాన్ని ’ఎథిరిక్’ అని పిలుస్తాం. ఈ ’ఎథిరిక్’ చిత్రాన్ని క్రింది చిత్రం లో చూడండి. ’ఆరా’ శరీరానికి కాస్త దూరంగా ఉంటుంది, ’ఎథిరిక్’తో పోలిస్తే ’ఎథిరిక్’ శరీరాన్ని ఆనుకుని వ్యాపిస్తుంది. శరీరానికి సుమారు అంగుళంలో ఎనిమిదోవంతు నుంచి ఒక్

కోసారి ఆరు అంగుళాల దూరం వరకు ఈ ’ఎథిరిక్’ వ్యాపించి ఉండవచ్చు. సరిగ్గా శరీరం ఎలాంటి ఆకారంతో ఉంటుందో అవే ఒంపు సొంపుల్ని కాపీ కొడుతూ ఈ ’ఎథిరిక్’ ఉంటుంది. ఓ వెంట్రుకను కూడా ఈ ’ఎథిరిక్’ చుట్టుముట్టి ఉంటుంది. ఈ ’ఎథిరిక్’ను గమనించి ఆ వ్యక్తియొక్క ఉత్సాహన్ని, శక్తినీ, ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. బాగా శారీరక శ్రమ ఛేసి అలసిపోయి నీరసంగా ఉన్న వ్యక్తి ’ఎథిరిక్’ శరీరానికి మరీ దగ్గరగా అంటుకుపోయి కనిపిస్తూంటుంది. మళ్ళీ అదే వ్యక్తి బాగా విశ్రాంతి తీసుకుని కులాసాగా ఉంటే ఈ ’ఎథిరిక్’ కూడా బలాన్ని పుంజుకున్నట్టు ఆరు అంగుళాల దూరం వరకు వ్యపించి ఉండాటాన్ని గమనించవచ్చు. ’ఎథిరిక్’ శరీరం ప్రక్కనే దాని ఎత్తుపల్లాల్ని చక్కగా - ఓ మొటిమ మీద కూడా - అనుసరిస్తూ వ్యాపించి ఉంటుంది. ఎథిరిక్ ని గురించిన ఓ విశేషాన్ని గురించి కూడా తెలుసుకుందాం.

                           ఓ మనిషికి ఉన్నట్టుండి తక్కువ ఆంపియరేజీ, ఎక్కువ ఓల్టేజీ ఉన్న విద్యుత్ ఘాతం తగిలితే, ఈ ఎథిరిక్ చటుక్కున నీలిరంగులో గానీ పింక్ రంగులో గానీ వెలుగుతూ దర్శనమిస్తుంది. ఓ ప్రత్యేకమయిన వాతావరణం నెలకొని ఉన్న రాత్రులలో కూడా ఈ ఎథిరిక్ ను స్పష్టంగా గుర్తించవచ్చు. సముద్రం మీద పయనిస్తున్న నౌకల్లో ఇలాంటి చిత్రాన్నే గమనించవచ్చు. వాతావరణం ఓ ప్రత్యేకమయిన పద్ధతిలో ఉన్నప్పుడు నౌకలో ఉన్న ప్రతి భాగం చుట్టూ ఓ లేత నీలిరంగు మంట, వెలుతురు కనిపిస్తుంది. చల్లటి ఈ నీలిరంగు మంట దేనినీ దగించదు, కానీ మొట్ట మొదటిసారి దీన్ని గమనిచిన చాలా మందికి భయంతో ముచ్చెమటలు పట్టే పరిస్థితి ఎదురవుతుంది. నౌకల మీద కనిపించే ఈ చల్లటి నీలిరంగు మంట లాంటి దానిని ’సెయింట్ ఎల్మోగారి మంట ’ అంటారు. శారీరం చుట్టూ ఉండే ’ఎథిరిక్’తొ ఈ వింతని పోల్చవచ్చు.

                            మీలో కొందరు చలికాలంలో రాత్రిపూట మారుమూల గ్రామాల్లో ఉన్నప్పుడు విద్యుత్తు స్తంభాల మధ్య బిగింపబడి ఉన విద్యుత్ తీగల మీద లేత నీలి, లేత తెలుపు వెలుగుల్ని గమనించే ఉంటారు. గాలిలో పొగమంచు కమ్ముకుని ఉన్న చలిరాత్రుళ్ళలో విద్యుత్ వాహకాల మీద ఈ చిత్రం సుస్పష్టంగా గోచరిస్తుంది. ఈ వెలుతురు విన్యాసాలకి జడుసుకున్న అమాయకులు కూడా ఎందరో ఉన్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎంచేత అంటే ’కరోనా’ అని పిలువబడే కాంతి వలయాలు చుట్టూ ఉన్న గాలిని అయనీకరణం చేసి గాలి లోంచి విద్యుత్తుని ప్రవహించేలా చేసి తద్వారా జరిగే షార్ట్ సర్క్యూట్ల వల్ల కొన్ని జిల్లాల్లో విద్యుత్తు ఆగిపోవడానికి కారణం అవుతుంది. అనేక ఊళ్ళు గాఢాంధకారంలో మునిగిపోతాయి. ఆధునిక ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఇలాంటి కరోనాలు పుట్టకుండా ఉండాటానికి బోలెడు డబ్బు ఖర్చుతో కూడుకున్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మన శారీరానికి ఏర్పడే కరోనాను ’ఎథిరిక్’ అని మనం అర్థం చేసుకోవచ్చు.

                           కొంత సాధనతోనే శరీరం చుట్టూ ఉన్న ’ఎథిరిక్’ ని చాలామంది చూడగలరు, ఓర్పు ఉన్నట్లయితే! దురదృష్టావసాత్తూ అందరూ ఏమనుకుంటారంటే యోగులకి సంవత్సరాలు పట్టే సాధనని త్వరగా తేరగా కొట్టేయాలీ, అలాంటి ట్రిక్కులను పట్టేయాలని! అట్లాంటి ఆశల్ని మాత్రం మీరు దగ్గిర చేరనీయకండి. సాధన చేయకుండా ఏదీ సాధించలేరు. సంగీత విద్వాంసులు రోజుకి కొన్ని గంటలు తమ సాధనను కొనసాగిస్తారు. వారి సాధన నిరంతరం సాగుతూనే ఉంటుంది. మీరు ’ఎథిరిక్’ను చూడాలంటే ఓర్పుతో సాధన చేయడం తప్పించి మరో ’దగ్గరి దారి’ లేనే లేదు. సాధన ఎలా చెయ్యాలో ఓ పద్ధతి చూద్దాం. ఇలంటి విషయాల్లో ఉత్సాహం చూపించే ఓ మనిషిని ముందుగా వెతికి పట్టుకోవాలి. ఆయనని తన చేతిని చాచమని చెప్పాలి. వ్రేళ్ళని పిడికిలి లాగా మడచి పట్టుకోకుండా వ్రేళ్ళు దూర దూరంగా జరిపి ఉండేలా అన్ని వ్రేళ్ళూ స్పష్టంగా కనబడేలాగా ఆ చేయి చాచబడి ఉండాలి. ఆ చేయి ఎలా చాపాలంటే ఆ వెనుక మరీ తెల్లరంగు గోడ కానీ, కర్టన్ కానీ ఉండకూడదు. ఆ చేతి వెనక ఉండే భాగం చీకటిగా కానీ మట్టిలాంటి తేలికరంగులో కానీ ఉండాలి. ఆ చెయ్యి - చేతి వ్రేళ్ళ వైపు మన దృష్టి ని ప్రసరింపచేయాలి. మరీ గ్రుడ్లు మిటకరించి వ్రేళ్ళ వంకా, చేతి వంకా తెరిపార చూడాకూడదు. చూడాటంలో ఓ చిన్న కిటుకు ఉంది. సరియైన చోట్లో, సరియైన పద్ధతిలో చేతి వైపు చూడాలి. అలా చూస్తే ఆ చేతిని అంటుకుని మెల్లగా రెపరెప లాడుతున్న ఊదా నీలిరంగు సిగరెట్ పొగ లాంటి వెలుతురు ఒకటి మీకంటికి గోచరిస్తుంది. ఇందాకే చెప్పుకున్నట్టు చేతికి సుమారు అంగుళంలో ఎనిమిదవ వంతు దూరం వరకు ఈ కాంతి వ్యాపించి ఉన్నట్టు కన్పించవచ్చు. చాలా మందికి చెయ్యి తప్ప మరొకటి ఏదీ కనిపించదు. ఎంచేతనంటే వాళ్ళు చేసే చూపు ప్రయత్నంలో ’అతి’ పాలు ఎక్కువ కాబట్టి! వాళ్ళు తమ చూపు తీక్షణతను కాస్త, ఇంకా కాస్త, మరి కాస్త తగ్గించండం చేస్తే వాళ్లకి ఆ వస్తువు తప్పక కనిపిస్తుంది. కాస్త ’తేలిగ్గా’ చూడ్డం నేర్చుకోవాలి. ఒకాయన ఇంకొకడికి దూరంగా ఉన్న అడవిని చూపిస్తున్నాడు. ఈయన కాసేపు పరీక్షగా చూసి ’ఎక్కడుందండీ అడవి? నాకళ్ళకి అన్నీ చెట్లే కనిపిస్తున్నాయి’ అన్నాడట! అలాంటి చూపు కాదు మనకి కావలసినది. చెట్లే అడ

వి అని అర్థం చేసుకోగల దృక్పధం కావాలి! కాబట్టి మీ శారీరం లోని టెన్షన్ తగ్గించుకుని రెలాక్సయిపోండి. "మరీ అంత ప్రయత్నం చెయ్యకూడదు. ఓపిగ్గా సాధన చేస్తే మీకు తప్పకుండా ’ఎథిరిక్’ కనిపించి తీరుతుంది.

                            ఇంకో పద్దతిలో కూడా సాధన చేయవచ్చు. ఇంకో మనిషి సాయం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సాధన మీ మీదే చేయవచ్చు. ఓ చోట్లో సుఖంగా కూర్చోండి. ఎదురుగా ఉన్న వస్తువు - టేబుల్ కానీ, గోడ కానీ మీ నుంచి కనీసం ఆరు అడుగులు దూరంలో ఉండేటట్లు కూర్చోవాలి. స్థిరంగా, గాఢంగా, నెమ్మదిగా శ్వాస పీల్చి మీ ముందుకు మీ రెండు చేతుల్ని చాపి బొటన వ్రేళ్ళు పై వైపు ఉండేలాగా రెండు చేతివ్రేళ్ళు చివర్లను ఒకదానితో మరొకటి తేలికగా తగుల్తూన్నట్లు ఉంచుకోవాలి. ఇప్పుడు మీ వ్రేళ్ళను కొద్దిగా దూరంగా జరపాలి. అంగుళంలో ఎనిమిదో వంతు దూరంగా కానీ, పావు అంగుళం దూరంలో కానీ మీ వ్రేళ్ళు జరిగిన పరిస్థితిలో మీ వ్రేళ్ళ మధ్య ’ఏదో’ వింత కనిపిస్తుంది. లేత ఊదారంగు పొరలాగా దాదాపు మెరుస్తున్న ఓ పదార్థం మీ వ్రేళ్ళను చుట్టూ ఆవరించబడి ఉండటాన్ని గమనించబచ్చు. ఈ వింత పదార్థాన్ని ’ఎథిరిక్’ అంటారు. మీ వ్రేళ్ళను నెమ్మది నెమ్మదిగా దూరంగా తీసుకెళ్తే ఈ ఎథిరిక్ విన్యాసాలు స్పష్టంగా చూడవచ్చు. మీ వ్రేళ్ళు దూరం కాగానే ఒక్కోసారి ఈ ఎథిరిక్ మాయం కావచ్చు. అలా జరిగితే రెండు చేతి వ్రేళ్ళు దూరం కాగానే ఒక్కోసారి ఈ ఎథిరిక్ మాయం కావచ్చు. అలా జరిగితే రెండు చేతి వ్రేళ్ళూ మళ్ళీ దగ్గరగా కలిపి మళ్ళీ మళ్ళీ ఈ సాధనని కొనసాగించండి. మీకు ’ఎథిరిక్’ కనిపించి తీరుతుంది. మీకు కావల్సిందల్లా విశ్వాసం, ప్రాక్టీస్ మాత్రమే. సంగీత సాధనని ఎప్పుడూ - ఇంకా ఎప్పుడూ విద్వాంసులు చేస్తూంటారనే సత్యం ఎప్పుడూ మరువకండి. అలాగే నిరంతరం సాధనతో మీరు కూడా ఇలాంటి అద్భుతాలను చేయగలరు.

                                          మరోసారి మీ చేతి వ్రేళ్ళ వంక చూసుకోండి. పరీక్షగా చూస్తే ఒక వ్రేలునుంచి మరో వ్రేలువైపుకు ఈ పొగమంచు లాంటి ’ఎథిరిక్’ ప్రవహిస్తూ మీకు గోచరమౌతుంది. మీ ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఈ ప్రవాహం కుడి చేయి నుంచి ఎడమ చేయి వైపుకు గానీ, ఎడమ చేతి వ్రేళ్ళ నుంచి కుడి చేతి వ్రేళ్ళ మీదికి గానీ ప్రవహిస్తూ కనిపిస్తుంది. ఈ ప్రవాహాలు స్త్రీ, పురుషులలో భిన్నంగ కనిపించవచ్చు. ఈ ప్రవాహాల పయనం మీ ఆరోగ్య పరిస్థితికి కానీ, మీ మానసిక పరిస్థితికి గానీ అనుకూలంగా ఉంటూ కనిపిస్తాయి. మీ ఆలోచనల పధకంకూడా ఈ ’ఎథిరిక్’ పవనాల వర్తనంపై తమ ప్రభావాన్ని చూపించవచ్చు.

                            ఈ ’ఎథిరిక్’ గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్న ఓ వ్యక్తి మీకు సహకరిస్తే మీ అరచేత్తో సాధనను సాగించవచ్చు. సహకరించే వారు స్తీ అయితే మరీ మంచిది. ఓ కుర్చీలో మీ ఎదురుగా అరచేతులు పైకి ఉండేలా పట్టుకోవాలి. మీరు కూడా మీ అరచేతులు క్రింది వైపుకు ఉండేలా మీతో సహకరించే వ్యక్తి చేతులు మీద దగ్గరగా మీ చేతులు వచ్చేటట్టు మీ చేతులను చాచాలి. మీ ఇద్దరి చేతుల మధ్య దూరం సుమారు రెండు అంగుళాలు ఉన్నప్పుడు మీ చేతుల్నించి చల్లని లేదా వెచ్చని గాలి ప్రవాహం వీస్తున్నట్లు మీకు తెలుస్తుంది. ఈ వాయు ప్రవాహం అరచేతి మధ్య భాగంలో మొదలౌతుంది. కుడి చెయ్యి నుంచి ఒక విధంగా, ఎడమ చెయ్యి నుంచి ఒక విధంగా ఈ వాయి చలనాలు ఉండవచ్చు. అవతలి వ్యక్తి పురుషుడు అయితే ఒక విధంగానూ, స్త్రీ అయితే ఒకవిధంగానూ కూడా ఈ వాయి చలనాలు ఉండవచ్చు. ఈ వాయు ప్రవాహం చల్లగా కానీ, వెచ్చగా కానీ ఉండవచ్చు. గాలి వెచ్చగా ప్రవహిస్తూ వుంటే పైన ఉన్న మీ చేతిని క్రింద చేతికి సరిగ్గా సమాంతరంగా ఉంచకుండా కొద్దిగా కోణం మార్చి కాస్త ఏటవాలుగా ఉండేటట్లు కదిలించి చూస్తే వీస్తున్న గాలి వేడి ఎక్కువ అవుతుంది. ఈ పరిస్థితిని చేరుకున్న తరువాత మీరు చేతుల మధ్య స్థలంలోనికి పరిశీలనగా చూస్తే మీకు స్పష్టంగా ’ఎథిరిక్’ గోచరిస్తుంది. ఈ ’ఎథిరిక్’ ఓ నోటి నుంచి వస్తున్న సిగరెట్ పొగ రంగులో కాకుండా నేరుగా సిగరెట్ నుండే వెలువడే పొగ రంగులో - అంటే మురికి గ్రే రంగు పొగలా కాకుండా లేత నీలి వర్ణంతో కన్పిస్తుంది.

                            మన శరీరంలో ప్రవహించే విద్యుత్తు తాలూకు బయటకు కనిపించే అయస్కాంత క్షేత్రమే ’ఎథిరిక్’ అనే విషయాన్ని పదే పదే మరిచిపోకుండా గుర్తుచేసుకుంటూ ఉండండి. దీన్నే ’ఎథిరిక్’ అనే పదాన్ని వినని వాళ్ళూ అర్థం చేసుకోలేని వాళ్ళూ ’దెయ్యం’ అని పిలుస్తుంటారు. ఆరొగ్యంతో ఉండి ఉన్నట్టుండి మరణించిన వ్యక్తి తాలూకు అయస్కాంతక్షేత్రం (ఎథిరిక్) వెంటనే నశించిపోకుండా శారీరం నుంచి బయటకు తప్పుకుని ఓ గమ్యం అంటూ లేకుండా అటూ ఇటూ ఆలొచన (మనస్సు) లేని స్థితిలో పిచ్చిగా విహారాలు చేస్తూంటుంది. గ్రహాంతర జీవాలకీ ఈ దెయ్యాలకీ బాగా తేడా ఉంటుంది. ఈ తేడాల గురించి మరోసారి చర్చించుకుందాం. ప్రస్తుతానికి ఈ దెయ్యం సంగతి కాస్త గమనిద్దాం. పాత స్మశానాలలో వీధి దీపాలు ఏమీ లేని చోట క్రొత్తగా నిర్మించిన సమాధుల్లోంచి రాత్రుళ్ళలో నీలిరంగు దెయ్యాలు నెమ్మదిగా బయటికి వస్తూంటాయనే మాటలని మీలో చాలామంది వినేవుంటారు. ఆ రోజే మరణించిన

శరీరం తాలూకు ’ఎథిరిక్’ శరీరం లోంచి బయటకు వచ్చి ఇలా ’దెయ్యాలు’ అనే పేరుతో పిలువబడుతూ ఉంటాయి. వేణ్ణీళ్ళు బాగా కాగిన తరువాత స్విచ్ ఆపేస్తే ఎలక్ట్రిక్ కెటిల్ లోని వేడి మెల్లగా బయటకి వెళ్ళిపోయే పరిస్థితి లాగానే ఈ దెయ్యాలు శవాల లోంచి బయటపడే పద్ధతిని ఊహించవచ్చు. చల్లరిపోతున్న కెటిల్ చుట్టూ వేడి తగ్గిపోయేట్టుగానే చచ్చిపొతున్న శరీరాల్లోంచి (చావు నెమ్మది నెమ్మదిగా ఓ క్రమంలో జరుగుతుందనే విషయం మరిచిపోకండి) ’ఎథిరిక్ బయటకు మెల్లగా చల్లగా జారుకుంటూ శక్తిని మెల్ల మెల్లగా కోల్పోతూ ఉంటుంది. కొన్ని దయ్యాలు మాత్రం ఓ పట్టాన శరీరం మరణించిన స్థలాన్ని అంత సులభంగా వదిలిపెట్టవు. అనేక రోజులు ఓ చోటునే పట్టుకుని వ్రేలాడే దయ్యల గురించి మనం మరో పాఠంలో చదువుకుంటాం.

                            సాధన - ఇంకా సాధన - ఇంకా సాధన కొనసాగించండి. మీ చేతుల వంక చూస్తూ సాధన చెయ్యండి మీ శరీరం వైపు దృష్టి సారిస్తూ సాధన చేయండి. ఓ స్నేహితునితో కలసి సాధన సాగించండి. ’ఎథిరిక్’ ని చూడటానికి సాధన చేయడం తప్ప మరో పద్ధతి లేదు. ముందుగా ’ఎథిరిక్’ని చూడగలిగే శక్తి సంపాదించుకున్న తరువాతే ’ఎథిరిక్’ కన్నా ఇంకా చాలా సూక్ష్మమైన ’ఆరా’లను మీరు చూడాగలరు.

Comments