కృష్ణకాళి దేవి ( krishna kali ) - Vishwagurunidhi

కృష్ణకాళి

కృష్ణావతారంలో, కృష్ణుని జీవితంలో కాళీ దేవి పాత్ర అడుగడుగునా కనిపిస్తుంది. బృందావన సంప్రదాయంలో కృష్ణుడు, కాళీ దేవి ఒక్కరే అనే భావన కనిపిస్తుంటుంది. కృష్ణకాళిగా, కృష్ణ స్వరూప కాళిగా అమ్మవారి ఆరాధన కనిపిస్తుంది. కృష్ణ కాళి దేవాలయం కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన అద్భుతమైన సంఘటనలను తెలియజేసే విశేషాలు మనకు కాళికా పురాణం, బృందావన స్థల పురాణ కథలలో కనిపిస్తాయి.

ఆ కథల్లో ఒకదాని ప్రకారం.. యశోద సోదరుడు శతగోపుడు. ఆయన భార్య రాధ (బృందావనేశ్వరి, గోలోక నాయిక అయిన రాధాదేవి వేరు. కృష్ణుని మేనమామ భార్య పేరు కూడా రాధ. అందుకే చాలా మంది రాధ అంటే కృష్ణుని మేనత్త అనుకుంటారు. కానీ ఆమె వేరు. ఆ స్వామి ప్రాణాధిక అయిన రాధాదేవి వేరు). ఆమె చిన్నప్పుడు కృష్ణుని ఎత్తుకొని పెంచింది. చిన్నికృష్ణుని సౌందర్యాన్ని ఆరాధించింది.
ఆయన అనుగ్రహం పొందింది. అందుకే కృష్ణుడు ఆమె కోసం యువకుడిగా మారి విహరిస్తూ ఉండేవాడు.

అది చూసి కొందరు శతగోపునికి ఆ విషయం చెప్పారు. ఒకసారి రాధతో కృష్ణుడు ఉన్నప్పుడు కొంతమంది శతగోపుని అక్కడికి తీసుకెళ్లారు. అక్కడకు వెళ్లి చూస్తే.. రాధాదేవి కాళీ దేవి విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగా కనపడింది. దీంతో వారంతా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అందరూ వెళ్లిన తర్వాత కాళీదేవి విగ్రహం కృష్ణునిగా మారిపోయింది. శతగోపుని రాకను గుర్తించిన కృష్ణుడు రాధను రక్షించడం కోసం అలా కాళిగా మారాడు. ఈ కథ బృందావన గాథలలో చాలా ప్రసిద్ధమైనది. అలాగే.. నరకాసురుని జీవితంలో కూడా కాళీదేవి ప్రధాన పాత్రగా కనిపిస్తున్నది.

నరకుని ఆరాధ్య దైవం కామాఖ్య కాళి. ఆమెను ఆరాధించి ఆమె అనుగ్రహం పొంది ఎన్నో అద్భుతమైన శక్తులు సాధించాడతడు. కానీ.. అతడు అధర్మబద్ధమైన సాధనలు చేయడం వల్ల కాళీ దేవి అతడి వద్ద నుంచి వెళ్లిపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ తల్లి నరకునికి కనిపించలేదు. నరకుని మరణ సమయంలో మాత్రం.. కృష్ణుడిలో కాళి కనిపించింది. అధర్మాన్ని నశింపజేయడానికి అలా కృష్ణ కాళిగా వచ్చి నరకుని సంహరించిందన్నమాట. కృష్ణ కాళిగా అమ్మవారిని భక్తితో, ప్రేమ భావనతో పూజిస్తే ఆమె కృష్ణ స్వరూపిణిగా, ప్రేమ స్వరూపిణిగా, కృష్ణునిగా అనుగ్రహిస్తుంది. బృందావనంలో ప్రవేశించిన ఎందరో సిద్ధులు కృష్ణుడే కాళి అని తెలుసుకుని కృష్ణ కాళిగా పూజించి అనుగ్రహం పొందారు.

Comments

  1. స్వామి సాధన పుస్తకం కావాలి

    ReplyDelete

Post a Comment